

శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మరియు ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎఫ్ఎల్ కౌన్సిలర్ మారపల్లి క్రాంతికుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ శివాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, సందేశాల కారణంగా ఏది నిజం, ఏది అబద్ధం అనేది గుర్తించడం ప్రజలకు కష్టంగా మారిందని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల్లో అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా డబ్బులు వస్తాయని, భద్రత లేకుండా లోన్లు ఇస్తామని వచ్చే సందేశాలను నమ్మి చాలామంది మోసపోయి డబ్బులు కోల్పోయారని వివరించారు.
అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం, అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయడం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. అలాగే ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పొరపాటున డబ్బులు వచ్చాయని చెప్పి తిరిగి పంపమని అడిగి మోసం చేసే ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవాలంటే అపరిచితులు పంపిన లింకులను ఓపెన్ చేయకూడదని, ఓటీపీని ఎవరికీ చెప్పకూడదని, అనుమానాస్పద లింకుల ద్వారా డబ్బులు పంపకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగశ్రీ, మారపల్లి విజయ్, ప్రసాద్, పరకాల కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పెంబర్తి సురేష్, రఘుపతి, నాగరాజ్, కిషన్‌రెడ్డి, మొగిలి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!