

గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల చిన్నారులు, వృద్ధులు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా, బ్రాంకైటిస్, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దగ్గు–జలుబు కేసులు అధికంగా నమోదవడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది.
చిన్న పిల్లల పై చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో పిల్లల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. పాఠశాలల్లో కూడా విద్యార్థుల హాజరు తగ్గింది. నగరంలో పెరిగిన చలి కారణంగా పిల్లలు, వృద్ధుల్లో అలర్జీ లక్షణాలు, చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
డాక్టర్లు చెబుతున్న మేరకు, చలి కాలంలో గురక పెరగడం, ఛాతిలో బిగుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం సాధారణమే. రాత్రిళ్లూ చల్లని పదార్థాలు తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు.
చలి కారణంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. చిన్నపిల్లలను చలిగాలికి ఎక్కువగా గురిచేయకుండా చూసుకోవాలి. బయటకు తీసుకెళ్లాల్సి వస్తే వారికి మంకీ క్యాప్, స్వెటర్ తప్పనిసరిగా వేయాలి. చలిగాలులు అధికంగా వీస్తున్న సమయంలో ఎముకలు, కండరాలు, జాయింట్లు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం, చర్మ సమస్యలు కూడా కనిపించవచ్చు. బీపీ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్లు సూచించినట్లు, ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, ఆకుకూరలు, గుడ్లు, పాలు, పప్పులు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో నడక, వ్యాయామం చేయడం కన్నా సూర్యోదయం తర్వాత బయటికివెళ్లడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత బయటకు రావడం, సాయంత్రం 5 గంటల లోపు ఇంటికి చేరుకోవడం సూచిస్తున్నారు.
హైదరాబాద్లో పొగమంచు కారణంగా ఉదయాలు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చల్లటి గాలులు ఉదయం నుంచే ప్రారంభమై, సాయంత్రం తర్వాత మరింత పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది త్వరగా పనులు ముగించుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా GHMC పారిశుధ్య కార్మికులు, పేపర్ బాయ్స్, పాల వ్యాపారులు పడుతున్న కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!