

మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, ఒత్తిడులను ఎదుర్కొని కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచిన బీఆర్ఎస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు, సోషల్ మీడియా వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మొత్తం యంత్రాంగంతో పోటీ చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయిందన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావం, బెదిరింపులను తట్టుకుని సాధించిన ఈ గెలుపు కాంగ్రెస్ పాలనపై ప్రజల అసంతృప్తికి నిదర్శనమని పేర్కొన్నారు. దాదాపు 700 పైగా వార్డుల్లో వచ్చిన విజయం యాదృచ్ఛికం కాదన్నారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని, ఎన్నికల హామీలు అమలుకాలేదని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేయడానికి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!