

హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై తన దృక్పథాన్ని వెల్లడించారు. “తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలన్నదే లక్ష్యం” అని పేర్కొన్నారు. సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రతి పౌరుడు ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కింద 99 రోజుల కార్యాచరణను ఒక ఉద్యమంగా అమలు చేయాలని అన్నారు.
ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం తెలిపారు. “మేం పాలకులు కాదు.. సేవకులం” అనే భావనతో ప్రజల అవసరాలే కేంద్రబిందువుగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాల్లో కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఇదే కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మాట్లాడుతూ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యమన్నారు. గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందజేసి, ప్రజలకు అవగాహన కల్పించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!