

టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మహీరా శర్మతో ఆయన డేటింగ్లో ఉన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ముంబైలోని ఒకే రెస్టారెంట్ వద్ద కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సిరాజ్ బయట అభిమానులతో మాట్లాడుతుండగా, అదే సమయంలో మహీరా శర్మ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి తన కారులోకి వెళ్లడం కనిపించింది. అయితే, ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించలేదు. అయినప్పటికీ, ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు స్పందించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో మహీరా శర్మ ఈ ప్రచారాలను ఖండిస్తూ, తాను ఎవరితోనూ డేటింగ్లో లేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సిరాజ్ కూడా గతంలో తన పై వస్తున్న వార్తలు నిజం కావని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. అయితే, ఆ పోస్టును కొద్దిసేపటికే తొలగించడం మరిన్ని సందేహాలకు దారితీసింది.
ప్రస్తుతం సిరాజ్ ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరి సంబంధం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. యాదృచ్ఛికంగా ఒకే చోట కనిపించారా లేదా నిజంగానే ఏదైనా ఉందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!