

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సిసి)లో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్మెంట్ కార్యక్రమం ఈ రోజు సందడిగా జరిగింది. ఈ నెల 4, 5 తేదీల్లో ప్రారంభమయ్యే ఈ లీగ్‌ను వచ్చే నాలుగు నుంచి ఐదు వారాల పాటు ప్రతి వీకెండ్ శని, ఆదివారాల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 పురుష, మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సిసి అధ్యక్షుడు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం చొరవతో ఈ లీగ్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. యువతను క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఎఫ్ఎన్సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ, ఈ లీగ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గోపీచంద్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నప్పటికీ, రేపటి కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. క్లబ్లో టోర్నమెంట్లు నిర్వహించి చాలా కాలమైందని, సభ్యుల సూచనల మేరకు ముందుగా క్లబ్ స్థాయి, ఆపై ఇంటర్ క్లబ్, తర్వాత నేషనల్ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు చాముండేశ్వరీనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా టాప్ ప్లేయర్లు ఈ లీగ్‌లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొనే ప్రతి టీమ్ రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని విజేతలకు ప్రైజ్ మనీగా అందిస్తామని వెల్లడించారు.
ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ, ఎఫ్ఎన్సిసి కేవలం క్లబ్ మాత్రమే కాకుండా సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు కేంద్రంగా మారిందన్నారు. చాముండేశ్వరీనాథ్ చొరవతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చెందిందని, దేశవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులను ఇక్కడికి తీసుకువచ్చారని చెప్పారు. ఎఫ్ఎన్సిసి సెక్రటరీ తుమ్మల రంగారావు మాట్లాడుతూ, గత కొద్ది నెలలుగా ఈ టోర్నమెంట్‌పై చర్చలు జరుగుతున్నాయని, కార్యవర్గం సహకారంతో దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సభ్యుడు సోమరాజు మాట్లాడుతూ, సానియా మిర్జా, లియాండర్ పేస్, పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖులను ఎఫ్ఎన్సిసికి తీసుకురావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. రెడ్డి, ట్రెజరర్ శైలజ జూజాల, కమిటీ సభ్యులు వేణు, ఏడిద రాజా, కోగంటి భవానీ తదితరులు పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!