

రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండటంతో పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, రాబోయే రెండు రోజులు కూడా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం కొనసాగనుంది. దీని కారణంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం మరియు రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించింది.
రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత పటాన్చెరులో నమోదైంది. అక్కడ 6.4 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా రికార్డు స్థాయి చలి నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.5 డిగ్రీలు, మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర దిశ నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!