

రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం వ్యయ ప్రణాళికలో రూ.34,875 కోట్లు, అంటే సుమారు 11 శాతం నిధులను విద్య కోసం కేటాయించింది. ఈ మొత్తంలో పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం (2025–26) తో పోలిస్తే పాఠశాల విద్య విభాగానికే రూ.502.66 కోట్లు అదనంగా ఇచ్చినట్లు బడ్జెట్లో వెల్లడించారు. అయితే పాఠశాల విద్యలో జీతభత్యాల ఖర్చు పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నట్లు వివరించారు.
ఉన్నత విద్యకు రూ.2,566.80 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాల నిర్వహణకు మొత్తం రూ.1,232.26 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించడం పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగానికి రూ.1,231.91 కోట్లు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యాన్ని స్పష్టం చేసింది.
సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూర్చుతుండగా, మిగతా 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ రెండు వాటాలు కలిపి ఈ ఏడాది మొత్తం రూ.2,946 కోట్లు అందుబాటులో ఉండొచ్చని అంచనా వేశారు.
ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు అందించే విద్యార్థి మిత్ర కిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.654 కోట్లు కేటాయించింది.
విద్యా రంగం అభివృద్ధి కోసం విభిన్న స్థాయిల్లో నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పాన్ని స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!