

దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా నిలిచిన శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగించారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ప్రకారం, పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ వంటి పదార్థాలకు రసాయనాలు కలిపిన కల్తీ పదార్థాన్ని “స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి” పేరుతో తిరుమలకు సరఫరా చేసినట్లు తేలింది. దాదాపు 59.71 లక్షల కిలోల కల్తీనెయ్యి లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ స్పష్టం చేసింది.
గత పాలనలో తితిదే నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించడంతో గుర్తింపులేని సంస్థలకు టెండర్లు దక్కాయని దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంతో సుమారు రూ.234 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సిట్ పేర్కొంది. కొందరు అంతర్గత అధికారుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన అత్యంత తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు పేర్కొనగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ పదార్థాల వినియోగం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆధ్యాత్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!