

సంక్లిష్టమైన మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేక గుర్తింపు కలిగిన నేతగా ఎదిగారు. బాబాయి శరద్ పవార్ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకుని, అధికార నిచ్చెన మెట్లను వేగంగా అధిరోహించారు. ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని ఎప్పుడూ దాచకుండా చెప్పిన ఆయన, ఆరు సార్లు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి అరుదైన రికార్డు సృష్టించారు. కాంగ్రెస్, శివసేన, భాజపా ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రూ.70 వేల కోట్ల నీటిపారుదల కేసు సహా ఎన్నో వివాదాలు ఎదురైనా, ప్రతి రాజకీయ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడ్డ నేతగా నిలిచారు.
1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్‌కు రాజకీయ జన్మనిచ్చింది బారామతే. 1991 నుంచి ఆ నియోజకవర్గం పవార్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సహకార రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. 2023 జూలైలో శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని విభజించడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ పేరు, గుర్తు అజిత్ వశమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు సాధించి తిరిగి రాజకీయ బలం చాటుకున్నారు. అయితే చిరకాల స్వప్నం నెరవేరకముందే జరిగిన విమాన ప్రమాదం ఆయన ఉజ్వల రాజకీయ ప్రస్థానానికి విషాదాంతం పలికింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!