

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి వివాదం తిరుమల తిరుపతి దేవస్థానాలుకే పరిమితం కాకుండా వరకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానం విస్తరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. తితిదే నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్... 2022 మే నుంచి 2023 మార్చి వరకు సుమారు 11 నెలల పాటు శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు గుర్తించింది. సాధారణంగా విజయ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసే దేవస్థానం, ఆ కాలంలో తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి సుమారు రూ.15.89 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
దర్యాప్తులో భోలేబాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి అసలు నెయ్యి కాకుండా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలతో తయారైన పదార్థమని ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. రాజేశ్ కార్పొరేషన్‌కు సొంత డెయిరీ లేకపోవడంతో, భోలేబాబా డెయిరీకి అనుబంధ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. గతంలో పాల సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే డెయిరీల నుంచే నెయ్యి కొనాలని దేవస్థానం నిర్ణయించినప్పటికీ, 2022లో ధరల వివాదం కారణంగా విజయ డెయిరీని తప్పించి రాజేశ్ కార్పొరేషన్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డెయిరీ నెయ్యి సరఫరా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానంలో రోజుకు లక్షకు పైగా లడ్డూలు విక్రయించబడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు దారితీసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!