

హిందూ దేవతల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా కార్యకలాపాల పై పూర్తి సమాచారం సేకరించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అతడి ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడీ వివరాలు అందించాలని కోరుతూ Instagram నిర్వాహకులకు పోలీసులు అధికారిక లేఖ పంపించారు. ఇన్స్టాగ్రామ్ నుంచి స్పందన కోసం ప్రస్తుతం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల అన్వేష్ విదేశాల్లో ఉంటూ హిందూ దేవతల పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల పై సోషల్ మీడియాలోనే కాకుండా పలు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని, అవసరమైతే భారత్కు తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ అంశం పై సినీనటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అన్వేష్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299 తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, హీరోయిన్ల వస్త్రధారణ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశాడు. మొదట ఆ వీడియో సాధారణ విమర్శలా కనిపించినప్పటికీ, అదే వీడియోలో హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపది దేవి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు మాత్రమే కాకుండా సాధారణ నెటిజన్లు కూడా ఖండించారు.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్వేష్ పై మరిన్ని ఫిర్యాదులు నమోదవుతున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా మత భావాలను దెబ్బతీసే వ్యాఖ్యల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!