

1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం చేసిన వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ‘ఆపరేషన్ సఫెడ్ సాగర్’ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ఆగస్టు 7న విడుదల చేయనుంది. ఓని సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, జిమ్మీ షెర్‌గిల్, దియా మీర్జా, ప్రజక్తా కోలీ, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యుద్ధ కథపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సిరీస్ ట్రైలర్‌ను నిజ జీవిత వీరులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. అమరవీరుడు స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో నటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అజయ్ అహుజా పాత్ర పోషించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఆయన భార్య అల్కా అహుజా అనుమతి ఇచ్చిన తర్వాతే ఈ పాత్రను అంగీకరించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన చేతికి కట్టు కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!