

కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న అసభ్య వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు సినీ రంగానికి తీవ్ర సమస్యగా మారుతున్నాయి. ప్రముఖ నటీనటుల ఫొటోలు, వీడియోలను వక్రీకరించి ప్రచారం చేయడంతో వారు మాత్రమే కాకుండా అభిమానులు కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ‘దేవర’ సినిమాలోని పాటను మార్పులు చేసి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే, ఇలాంటి నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకునే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
మార్ఫింగ్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడం లేదా వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సైబర్ సహాయ కేంద్రాలు, అభ్యంతరకర కంటెంట్‌ను వేగంగా తొలగించే సమర్థవంతమైన విధానాలు అందుబాటులో ఉండాలి. నటీనటులు వ్యక్తిగత చిత్రాలను పంచుకునేటప్పుడు గోప్యతా సెట్టింగులు, వాటర్‌మార్క్‌లు, ఇతర డిజిటల్ భద్రతా చర్యలను పాటించాలి. అభిమానులు కూడా అనుమానాస్పద పోస్టులను ఫార్వర్డ్ చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి. ఏఐ రూపొందించిన కంటెంట్‌ను చూసిన వెంటనే నిజమని నమ్మకుండా, దాని విశ్వసనీయతను పరిశీలించిన తర్వాతే స్పందించడం అత్యంత అవసరం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!