

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ బుధవారం ముంబయిలోని ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఆయనకు భారతీయ సినిమా విశేషాలను వివరించారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రాన్ని వీక్షించాలని కోరుతూ, ఈ సినిమా చిత్రీకరణలో ఎక్కువ భాగం యూకేలోనే జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా భారతీయ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ, మారుతున్న కథాంశాల గురించి వివరించారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిందని, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కరణ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా పాల్గొన్నారు.
పశ్చిమాసియా దేశాల్లో భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని కరణ్ జోహార్ ప్రిన్స్ విలియమ్‌కు వివరించారు. ఈ సందర్భంగా క్రికెట్ గురించి కూడా చర్చ జరిగినట్లు వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమకు లండన్‌తో ఉన్న అనుబంధాన్ని యువరాజుతో పంచుకున్నారు. ఈ భేటీని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని ‘సే శావా శావా’, ‘బోలే చూడియా’ పాటలకు సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం అతిథులకు భారతీయ సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రిన్స్ విలియమ్‌కు భారతీయ సినిమా, బాలీవుడ్ సంస్కృతి, సంప్రదాయ ఆతిథ్యాన్ని పరిచయం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!