

మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ పై ఆసక్తికర సమాచారం వెలువడింది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ తన పాత్ర గురించి స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆయన మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నారని ప్రచారం జరిగినా, ఆ వార్తలను ఆయన ఖండించారు. ‘వారణాసి’ లో తాను శివుడి పరమ భక్తుడి పాత్రలో కనిపిస్తానని ఒక కార్యక్రమంలో తెలిపారు. అలాగే హిందీ చిత్రం ‘దృశ్యం 3’ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే ‘విక్రమార్కుడు’ లో నటించారు. అలాగే మహేష్ బాబుతో ‘ఒక్కడు’, ‘రాజకుమారుడు’, ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ఇప్పుడు ‘వారణాసి’ లో ఈ ముగ్గురు మరోసారి కలవడం విశేషం. ఈ మైథలాజికల్ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇందులో ప్రియాంకా చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.
సినిమా తదుపరి షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. అలాగే అంటార్టికాలో కూడా ఒక కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడ షూటింగ్ జరిగితే, ఆ ప్రాంతంలో చిత్రీకరణ చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలవొచ్చు. ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ మరియు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!