

తెలంగాణలో వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ గణనీయమైన వర్షాలు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో గత వారం రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఖరీఫ్ సాగు ఎలా కొనసాగించాలా అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈరోజు నుంచి కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే సూచనలు లేవు. జూలై నెలలో ఇప్పటివరకు సాధారణంగా నమోదవాల్సిన 10 సెంటీమీటర్ల వర్షపాతం స్థానంలో కేవలం 4 సెంటీమీటర్లే నమోదవడంతో దాదాపు 60 శాతం వర్షాభావం నెలకొంది.
రాష్ట్రంలోని 29 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవగా, మిగతా జిల్లాలన్నింటిలోనూ లోటు కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 66 శాతం వర్షాభావం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు నమోదవాల్సిన 23.6 సెంటీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 15 సెంటీమీటర్లే నమోదవడంతో వ్యవసాయ రంగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!