

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రంపై హీరో అక్కినేని అఖిల్ ప్రశంసలు కురిపించారు. కథాబలం ఉన్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. లక్ష్మణ్, కలిపు మధు నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కంటెంట్‌ను నమ్ముకుని మంచి కథను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే నేటి కమర్షియల్ సినిమా అని అఖిల్ అన్నారు. చిన్నప్పటి నుంచి సుమంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన తనపై చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. నిజాయతీతో కూడిన కంటెంట్ సినిమాకు సిద్ధు అండగా నిలవడం అభినందనీయమన్నారు.
దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ సినిమాలో ప్రతి నటుడు పాత్రలను కేవలం పోషించలేదని, వాటిలో జీవించారని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతంలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. సుమంత్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ సమయంలో తమ వెనుక ఏదో తెలియని శక్తి నడిపిస్తోందన్న నమ్మకం ఉండేదని, సెప్టెంబర్ 11న ప్రేక్షకులకు తమ కష్టం కనిపిస్తుందని అన్నారు. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్, ముఖ్యంగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ చిత్రంలో సుమంత్, సిద్ధు మధ్య వచ్చే ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. నిర్మాత మధు కారణంగానే తాను ఈ సినిమాలో భాగమయ్యానని సిద్ధు చెప్పగా, దర్శకుడు కథను అనుకున్న విధంగానే తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, అలీ, లక్ష్మణ్, మధు, అనూప్ రూబెన్స్, కాసర్ల శ్యామ్, వెనిగళ్ల రాంబాబు, మంజు భార్గవి, జెస్సీ గిఫ్ట్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!