

ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ బిగ్‌బాస్ 20లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. సెప్టెంబర్ 6న ఘనంగా ప్రారంభమైన ఈ హిందీ రియాలిటీ షోలో ఆమె రాబోయే ఎపిసోడ్లలో హౌస్‌లో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా మేరీకోమ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వీడియోను విడుదల చేశారు. మేరీకోమ్ దేశానికి గర్వకారణమని పేర్కొన్న ప్రియాంక.. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఇతర కంటెస్టెంట్లు మేరీకోమ్ పంచ్‌ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా 2014లో తెరకెక్కిన బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్న సినిమాల్లో ఒకటని ప్రియాంక గతంలో పేర్కొన్నారు. ఫైటర్‌గా, గృహిణిగా, తల్లిగా మేరీకోమ్ పాత్రను తెరపై ఆవిష్కరించడం ఎంతో కష్టంగా అనిపించిందని చెప్పారు. చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మేరీకోమ్ క్రీడారంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ స్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!