

వైవిధ్యమైన సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు. మాటలే లేకుండా సినిమాను తెరకెక్కించి సినీ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన సినీ రుషి. ఆయనే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. సుదీర్ఘ విరామం తర్వాత, 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.
ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ‘సెంచరీలు కొట్టే వయసు మాది’ అన్నట్టుగా సింగీతం శ్రీనివాసరావు చురుగ్గా పని చేస్తూ కనిపించడం ఆకట్టుకుంది. ఆయన అపారమైన ప్రతిభను, సినీ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ పలువురు హీరోలు, దర్శకులు చెప్పిన మాటలు వీడియోలో వినిపించాయి. ఈ కొత్త చిత్రం టైటిల్, నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్లో 61వ చిత్రం కావడం మరింత విశేషం.
1972లో ‘నీతి–నిజాయతీ’ చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. భారతీయ సినీ చరిత్రలో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ‘మయూరి’తో అనేక మందికి స్ఫూర్తినిచ్చారు. టాకీ యుగంలోనే ‘పుష్పక విమానం’ అంటూ మూకీ సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ‘విచిత్ర సోదరులు’లో మూడు అడుగుల కమల్‌హాసన్‌ను చూపించి ప్రేక్షకులను విస్మయానికి గురిచేశారు. ‘ఆదిత్య 369’తో కాలయాత్రలోకి తీసుకెళ్లారు. మాస్, కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న కాలంలో ‘భైరవ ద్వీపం’లాంటి జానపద చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. చివరిగా 2013 లో ‘వెల్కమ్ ఒబామా’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన, ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’కి విలువైన సూచనలు అందించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టి, అదే ఉత్సాహంతో “యాక్షన్” అంటూ ముందుకు సాగుతుండటం సినీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!