

‘ది రాజాసాబ్’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ విరామాన్ని కొత్త తరహా కథతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు. కమర్షియల్ కథలకు భిన్నంగా, కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మైథాలజికల్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. సంప్రదాయ పట్టుచీరలో చేతిలో దీపంతో కనిపిస్తున్న నిధి వెనుక ఆరు చేతులతో కూడిన దైవిక ఉగ్రరూపాన్ని చూపించడం ద్వారా కథపై ఆసక్తిని రేకెత్తించారు. పురాణాల నేపథ్యానికి థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నిధి పాత్ర కీలకంగా ఉండనుంది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఎంచుకున్న నిధి.. ఈ సినిమాతో తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకురాగలరా అనే ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!