

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ దేశీయ మార్కెట్లో గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఏ07కు కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ ప్రారంభ స్థాయి ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగో తరం మొబైల్ నెట్‌వర్క్ అనుసంధానానికి మాత్రమే మద్దతు ఇచ్చే ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ నిల్వ సామర్థ్యంతో లభిస్తుంది. దీని ధరను రూ.18,499గా నిర్ణయించారు. ముదురు నీలం, ఆకుపచ్చ, వెండి రంగుల్లో లభించే ఈ ఫోన్‌ను శాంసంగ్ ప్రత్యేక విక్రయ కేంద్రాలు, శాంసంగ్ డాట్ కామ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ వేదికల్లో కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ ఏ08లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ తెర, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 ప్లస్ ప్రాసెసర్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా నిల్వ సామర్థ్యాన్ని 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. వెనుక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ముందు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 25 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్, శాంసంగ్ నాక్స్ భద్రతా వ్యవస్థ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ, ఐపీ64 దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ, భద్రతా నవీకరణలను ఆరేళ్లపాటు అందిస్తామని శాంసంగ్ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!