

సినిమా పూర్తయిన తర్వాత నిడివి ఎక్కువగా ఉండటం, కథాగమనానికి కొన్ని సన్నివేశాలు అడ్డుగా మారుతున్నాయని భావించడం వంటి కారణాలతో దర్శకులు వాటిని తొలగిస్తుంటారు. అయితే చివరి నిమిషంలో అలాంటి సన్నివేశాలను సినిమాలో ఉంచితే.. అవే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ విషయంలోనూ ఇదే జరిగింది. మొదట తొలగించాలని భావించిన ‘వద్దు సరోజ’ కామెడీ సీన్.. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
యశో సాగర్, స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘వద్దు సరోజ’ సన్నివేశం కరుణాకరన్ జీవితంలో జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది. కెరీర్ ప్రారంభ రోజుల్లో దర్శకుడు శశితో కలిసి సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కేకే నగర్‌లోని ఓ టిఫిన్ బండి వద్ద కరుణాకరన్‌కు ఈ సంఘటన ఎదురైందట. ఓ వ్యక్తి వచ్చి గొడవ చేయడంతో.. బండి యజమాని భార్య ఆగ్రహంతో అతడిని చితకబాదిందట. ఆ ఘటనను గుర్తుపెట్టుకున్న కరుణాకరన్ చాలా మందికి చెబుతుండేవారు. అయితే ఏ సినిమాలోనూ దాన్ని ఉపయోగించే అవకాశం రాలేదు. చివరకు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ఈ సన్నివేశానికి చోటు దక్కింది. థియేటర్లలో దీనికి మంచి స్పందన రావడంతో ‘వద్దు సరోజ.. వద్దమ్మా’ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆటపట్టించేందుకు కూడా చాలామంది ఈ డైలాగ్‌ను ఉపయోగించేవారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!