

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాయదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీకాంత్ ఓదెల, రాఘవ్ జుయల్ మధ్య జరిగిన సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సినిమా నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాన్ని శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలనే ఆలోచన, వారిని మెప్పించగలనా అనే భయం షూటింగ్ ఆలస్యానికి ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు.
సినిమా గురించి వివరిస్తూ మొదట ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో కథ రాయడం ప్రారంభించానని, రాస్తున్న కొద్దీ కథ మరింత విస్తృతమై భారీగా మారిందని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. ఈ తరహా కథాంశంతో తెలుగులో చాలా కాలంగా సినిమా రాలేదని, ప్రతినాయకుడి పాత్ర కోసం దాదాపు ఎనిమిది నెలల పాటు నటుడి కోసం వెతికామని తెలిపారు. చివరకు రాఘవ్ జుయల్‌ను ఎంపిక చేశామని, ఆయన పరిచయ సన్నివేశం తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ప్రేక్షకుల కోసం చిన్న విషయాల్లోనూ రాజీ పడకుండా రిస్క్ తీసుకున్నానని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా కాదని, కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూడగలిగేలా తెరకెక్కించిన అద్భుతమైన భావోద్వేగ చిత్రం అని స్పష్టం చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!