

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ‘ఫాహ్..’ అనే విచిత్రమైన సౌండ్ తమిళం, తెలుగు సోషల్ మీడియా వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ సినిమాల్లోనూ ఈ సౌండ్ వినిపించడంతో దాని క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ వైరల్ సౌండ్ వెనుక టాలీవుడ్ దివంగత కమెడియన్ వేణుమాధవ్ ఉన్నారంటూ ప్రముఖ తమిళ వాయిస్ ఆర్టిస్ట్ కీర్తి వాసన్ వెల్లడించారు. వీజే మోహన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వేణుమాధవ్ వాయిస్‌లో ప్రత్యేకమైన టోన్ ఉండేదని, తాను డబ్బింగ్ ప్రారంభించిన రోజుల్లో ఆయన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవాడినని తెలిపారు.
వేణుమాధవ్ ఆశ్చర్యం లేదా ఇతర భావాలను వ్యక్తం చేసేటప్పుడు ‘వాహ్.. అరే.. వాహ్’ అంటూ ఎనర్జిటిక్‌గా పలికేవారని కీర్తి వాసన్ వివరించారు. అదే తమిళ డబ్బింగ్‌లో ‘ఫాహ్..’గా మారిందని, తాను దాన్ని మరింత ఫన్నీగా ‘డా.. ఊ.. ఫాహ్.. సూపర్ ఫాహ్..’ అంటూ ఉపయోగించడం ప్రారంభించానని చెప్పారు. అలా ఆ సౌండ్ క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చిందని, ఇప్పుడు తమిళం, తెలుగులో చాలామంది దాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ ‘ఫాహ్’ సౌండ్‌కు అసలు క్రెడిట్ మాత్రం వేణుమాధవ్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వేణుమాధవ్ ప్రత్యేకమైన కామెడీ శైలి, డైలాగ్ డెలివరీకి ఇది మరో గుర్తింపుగా అభిమానులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!