

మంచు మనోజ్ హీరోగా, హనుమరెడ్డి యక్కండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో, భారత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సాహసోపేతమైన విప్లవం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్యన్ నటి, ‘ప్రిన్స్’ ఫేమ్ మరియా రియాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా, ఆంగ్లేయుల అన్యాయాలను ఎదిరించే యోధుడిగా మంచు మనోజ్ కనిపించనున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె పాత్రకు సంబంధించిన శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. ‘బాహుబలి’లోని శివగామి పాత్రను మించే ఉగ్రరూపంలో ‘కమలారెడ్డి’గా రమ్యకృష్ణ కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో రమ్యకృష్ణ తీవ్రమైన కోపంతో కుర్చీలో కూర్చుని, చేతిలో పెద్ద కత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆమె చుట్టూ రక్తపు మడుగులు, పాదాల కింద శవాలు కనిపించడం పోస్టర్‌కు మరింత తీవ్రతను తీసుకొచ్చింది. ‘ఆమెకు యుద్ధభూమి అంటే భయం లేదు.. యుద్ధభూమియే ఆమెకు భయపడుతుంది’ అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సముద్రఖని, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెల్‌వెట్ సౌండ్, ట్రూ రెడిక్స్ బ్యానర్లపై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!