

అల్లు అర్జున్‌తో యాడ్ షూట్ సమయంలో కఠినమైన నిబంధనలు ఉంటాయని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఆమె చెప్పిన విషయాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని కోరింది. అల్లు అర్జున్ ఎప్పుడూ మర్యాదగా, గౌరవంతో వ్యవహరిస్తారని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా తమ న్యాయ బృందం ఇప్పటికే పని ప్రారంభించిందని వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక నోట్ ద్వారా తెలియజేసింది.
ఇంతకీ కావేరీ బారువా ఏమన్నారంటే...
ఇటీవల ఇచ్చిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి వేర్వేరు వ్యక్తిత్వాలు ఉంటాయని అన్నారు. అల్లు అర్జున్‌తో యాడ్ షూట్ సమయంలో తనకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురైందని తెలిపారు. దక్షిణాది హీరోలకు సాధారణంగా పెద్ద టీమ్ ఉంటుందని, అల్లు అర్జున్ను కలిసే సమయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయంలో సుమారు 42 నియమాలు ఉంటాయని చెప్పారు. ఈ నియమాల విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. హీరోకు హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని, తగిన దూరం పాటించాలని, హీరో సెట్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదని ముందుగానే చెబుతారని అన్నారు. ఆ యాడ్ షూట్ సమయంలో అల్లు అర్జున్ సెట్‌కి వస్తుండగా, తాను సెట్ చివరలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా, ఆయన బాడీగార్డ్ ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకుని, అక్కడ ఫోన్ వాడటం అనుమతి లేదని చెప్పాడని తెలిపారు. అయితే ఫోన్ వాడటం తన పని భాగమే అయినప్పటికీ, హీరో వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు అలా కఠినంగా ఉండి ఉండవచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!