

న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ ఆరంభంలో పక్కింటి అబ్బాయి తరహా సహజమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘ప్యారడైస్’ వంటి చిత్రాల్లో మాస్, యాక్షన్ అంశాలతో కూడిన పాత్రలను ఎంచుకున్నారు. ఈ సినిమాలతో ఆయన మార్కెట్ పరిధి కూడా మరింత విస్తరించింది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాస్ ఛాయలున్న యాక్షన్ చిత్రం ‘బ్లడీ రోమియో’లో నటిస్తున్నారు. అయితే వరుసగా భారీ యాక్షన్ కథలకే పరిమితం కాకుండా, ఇకపై కొంత విరామం తీసుకుని తనకు బాగా సరిపోయే సహజమైన, కుటుంబ కథల వైపు దృష్టి సారించాలని నాని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న సూచనలు, కుటుంబ కథలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని తన పాత శైలికి దగ్గరయ్యే కథలను ఎంచుకోవాలని నాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శివ నిర్వాణ, వెంకీ అట్లూరి వంటి దర్శకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, సహజమైన పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలను పరిశీలిస్తున్నారట. అయితే యాక్షన్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా, కథకు అవసరమైన మేరకు ఆ జానర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఒకే తరహా చిత్రాలకు పరిమితం కాకుండా విభిన్న కథలను సమతూకంగా ఎంచుకోవాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది. ‘ప్యారడైస్’ తర్వాత ఆయనలో కనిపిస్తున్న ఈ మార్పు తదుపరి చిత్రాల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!