

తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత, ఉద్యమ పితామహుల్లో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును ఒక స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పవిత్రవాణి ప్రస్తుతం వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల కుటుంబాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా నియమించడంతో పాటు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్‌లో అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో బాపూజీ కుమార్తె పవిత్రవాణికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!