

లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘జవాన్’ సినిమాతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె, ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘మాన్‌స్టర్’లో కనిపించనున్నారు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు సమానంగా ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంటుందని, కథను కీలక మలుపు తిప్పే ట్విస్ట్ కూడా ఆమె పాత్రతో ముడిపడి ఉంటుందని సమాచారం. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘మాన్‌స్టర్’లో నయనతార సల్మాన్ ఖాన్ భార్యగా కనిపించనున్నారని, అయితే ఆమె పాత్రలో ఊహించని కోణం ఉంటుందని తెలుస్తోంది. సాధారణ గృహిణిగా కాకుండా, తన భర్తనే చట్టానికి పట్టించేందుకు రహస్యంగా పనిచేసే అండర్‌కవర్ పోలీస్ అధికారిణిగా ఆమె నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. భర్తపై ప్రేమ, మరోవైపు విధి నిర్వహణ మధ్య జరిగే సంఘర్షణ ఈ పాత్రకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ఈ నేపథ్యంలో సినిమాలో భావోద్వేగాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, నయనతార, వంశీ పైడిపల్లి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2027 రంజాన్ సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!