

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఒక స్టార్ కథ మాత్రమే కాదు, స్వయంకృషితో సాధించిన విజయ గాథ. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా 1978 లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, తొలి చిత్రం ఫ్లాప్ అయినా తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ తో నటుడిగా నిలదొక్కుకున్నారు. చిన్న పాత్రల నుంచి విలన్ రోల్స్ వరకు చేస్తూ నెమ్మదిగా కానీ బలంగా ఎదిగారు. 1980 లలో ‘మొగుడు కావాలి’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. 1983 లో విడుదలైన ‘ఖైదీ’ సినిమా చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్‌స్టార్‌గా మార్చి, కమర్షియల్ సినిమాలకు కొత్త దిశ చూపించింది.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2007 తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో మళ్లీ సినిమాలవైపు మొగ్గు చూపారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 2017 లో ‘ఖైదీ నెం.150’ తో రీఎంట్రీ ఇచ్చి, ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లతో తన స్టామినాను నిరూపించారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
ఇలాంటి సమయంలోనే టాలీవుడ్లో పెరుగుతున్న పాడ్‌కాస్ట్ ట్రెండ్‌పై చిరంజీవి దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇటీవల తన నివాసంలో మీడియాతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ పాడ్‌కాస్ట్‌కు ఆయన కుమార్తె సుష్మిత కొణిదెల, రైటర్-డైరెక్టర్ బీవీఎస్ రవి సన్నాహాలు చేస్తున్నారని టాక్. సాధారణంగా గతం గురించి ఎక్కువగా మాట్లాడని చిరంజీవి, తన నాలుగు దశాబ్దాల అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలను పాడ్‌కాస్ట్ రూపంలో అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, టాలీవుడ్లో పాడ్‌కాస్ట్ ప్రారంభించిన తొలి హీరోగా చిరంజీవి కొత్త రికార్డు సృష్టించే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!