

ప్రభాస్–పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ సినిమా గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో కమెడియన్ ప్రభాస్ శ్రీను పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. హీరో ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రభాస్ శ్రీను గురించి తెలిసిందే. అయితే మొదటగా ‘రాజాసాబ్’ సినిమాలో ఆయన పాత్రకు తమిళ కమెడియన్ యోగి బాబును ఎంపిక చేసినట్లు సమాచారం. యోగి బాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మారుతి అనుకోని విధంగా నిర్ణయం మార్చుకుని, ఆ పాత్రకు ప్రభాస్ శ్రీనునే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంతవరకూ బాగానే ఉన్నా… కొంత షూటింగ్ పూర్తైన తర్వాత హీరో ప్రభాస్‌కు ప్రభాస్ శ్రీను మీద అసంతృప్తి ఏర్పడిందట. దీంతో కమెడియన్‌ను మార్చేయాలని సూచించడంతో, మరో కమెడియన్‌ను తీసుకుని అప్పటివరకు తీసిన సన్నివేశాలన్నింటినీ మళ్లీ రీషూట్ చేసినట్లు సమాచారం. అయితే కొద్ది రోజులకే ప్రభాస్ మళ్లీ దర్శకుడిని పిలిచి, ప్రభాస్ శ్రీను కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంతో బాధపడుతున్నారని, అందుకే అతనినే కొనసాగించాలని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మళ్లీ అదే సీన్లను మరోసారి రీషూట్ చేయాల్సి వచ్చిందట. ఈ మొత్తం ప్రక్రియ వల్ల నిర్మాతలకు భారీగా ఖర్చు అయ్యిందని టాక్.
ఇదే కాకుండా, సినిమాలో హీరోయిన్లకు పదే పదే ఫొటోషూట్లు నిర్వహించారట. అవి కూడా ముంబయికి చెందిన పేరున్న ఫేమస్ ఫోటోగ్రాఫర్లతో చేయించడంతో, ఒక్కో ఫొటోషూట్‌కే లక్షల్లో బిల్లులు వచ్చాయని సమాచారం. మొత్తంగా ‘రాజాసాబ్’ సినిమా నిర్మాణంలో డబ్బులు భారీగా వృథా అయ్యాయన్న మాటకు ఇవి కొన్ని చిన్న ఉదాహరణలేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!