

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైకి 570 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 590 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 710 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి మధ్యాహ్నానికి మచిలీపట్నం-పూరీ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తీవ్ర తుపానుగా దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుపాను కదలికలను ఆర్టీజీఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 NDRF బృందాలు, 11 SDRF బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు APSDMA ఎండీ, RTGS సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!