

పంట పొలాలకు సాగునీరు అందించలేని ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు ఎందుకు విడుదల చేయడం లేదని, రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తున్నప్పుడు.. పక్కనే ఉన్న పాలమూరు ప్రాంతానికి ఎందుకు నీరు అందించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, కరివెన, వట్టెం రిజర్వాయర్లను మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలోనూ మోటార్లు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం, కొందరిని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!