

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మహిళల స్వేచ్ఛ, రాజకీయ భాగస్వామ్యంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. మహిళలపై అంత గొప్ప అభిప్రాయం ఉంటే మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని రిజిజు కోరారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లోనే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఇప్పటివరకు దాన్ని అమలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ యువతే దేశానికి అతిపెద్ద బలమని అన్నారు. యువతకు సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన ఉద్యోగావకాశాలు లేవని, విద్యా ప్రమాణాలు తగ్గడం, తయారీ రంగం బలహీనపడటం, రుణాల లభ్యతలో ఇబ్బందులు, కృత్రిమ మేధ, ప్రశ్నపత్రాల లీకేజీల వంటి సమస్యలు యువతను నిరాశకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఆందోళనలు ప్రజల్లో చైతన్యం కలిగించాయని అన్నారు. కాంగ్రెస్ కంటే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థుల సమస్యలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలపై ప్రభుత్వం ఆకస్మికంగా బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!