

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వహించిన 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ముగింపు సందర్భంగా ప్రపంచ దేశాధినేతలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కానుకలను అందించారు. పిచ్వాయి గోల్డెన్ పెయింటింగ్, రాయల్ బ్లూ బనారసీ కాటన్ సిల్క్ స్టోల్, కశ్మీరీ సిల్క్ కార్పెట్ వంటి విశిష్టమైన కళాకృతులను నేతలకు బహూకరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ హస్తకళలు, వస్త్ర నైపుణ్యాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా ఈ కానుకలను ఎంపిక చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో తయారుచేసిన బంగారు పిచ్వాయి పెయింటింగ్‌ను మోదీ బహూకరించారు. వస్త్రంపై ఖనిజ వర్ణద్రవ్యాలతో తామర పూలు, ఆవులు, చెట్ల నమూనాలను చిత్రించి, వాటికి బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు జైపుర్ సంప్రదాయ నీలిరంగు మట్టి కళాఖండాన్ని అందించారు. జపాన్ ప్రధాని సనాయే తకాయిచికి బనారస్ నేతపనితనాన్ని చాటిచెప్పే రాయల్ బ్లూ బనారసీ కాటన్ సిల్క్ స్టోల్‌ను ఇచ్చారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌కు కశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను, ఆయన సతీమణికి పాపియర్-మాచే పెట్టెలో ఉంచిన శాలువాను బహూకరించారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాకు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వెండితో పొదిగిన బిద్రీవేర్ వాజ్‌ను, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు చోళుల కాలం నాటి కాంస్య శిల్పాన్ని అందించారు. ఇతర ఆసియాన్ నేతలకు కూడా భారతీయ కళా సంప్రదాయాలను ప్రతిబింబించే కానుకలను మోదీ బహూకరించారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!