

శ్రీలంక సమీపంలోని మన్నార్ అఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 11న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఇది బలపడి ఈ నెల 13 తర్వాత తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశమూ ఉందని పేర్కొన్నారు.
వాయుగుండం ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!