

రాష్ట్ర నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ 23 రోజులుగా ఆందోళన చేస్తున్న ఝార్ఖండ్ ఉద్యోగార్థుల ప్రతినిధులను సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా కలవాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు సోరెన్‌కు ఆయన లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి కీలకమైన మూలస్తంభాల్లో ఒకటని రాహుల్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని తెలిపారు. ఝార్ఖండ్ విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని కోరారు.
విద్యార్థులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు నిరసనకారులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా వారిని కలిసి వారి సమస్యలను వినాలని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వం తమ డిమాండ్లపై సరైన హామీ ఇవ్వడం లేదని ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ ఆదివారం రాంచీలో ఆందోళనకారులు సీఎం హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!