

అమెరికా–ఇరాన్ మధ్య చర్చలపై మరోసారి గందరగోళం నెలకొంది. తదుపరి విడత చర్చలపై ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ దీనిని ఖండించింది. అలాంటి సమావేశం ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలో, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. పాకిస్థాన్ కూడా వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య చర్చలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ఇరాన్ ప్రతినిధి కజెమ్ ఘరీబాబాదీ ఈ ప్రకటనలను తిరస్కరించి, ప్రస్తుతం సాధారణ సంప్రదింపులు మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పారు.
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేస్తూ, ఖతార్‌లో జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల్లో 600 కోట్ల డాలర్లను విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో, అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున పబిత్రా మార్గెరిటా, సయ్యద్ అతా హస్నైన్ హాజరు కానున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!