

అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓ పోస్టుకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పదవి కోసం 5,300 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వారిలో 18 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. మంగళ, బుధవారాల్లో ఆలయ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ సురేశ్ హవారేలతో కూడిన ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనుంది.
సీఈఓగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హిందూ మతాన్ని ఆచరించే, శాకాహారులైన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రామమందిరానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను సీఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇటీవల రామమందిర విరాళాల చోరీ ఘటన వెలుగులోకి రావడంతో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఈఓను నియమించాలని ట్రస్ట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!