

ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముండగా, శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మిగతా జిల్లాల్లో కూడా తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!