

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఇంధన రవాణాలో భారీ అంతరాయాలు ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. తమ సుదూర దాడుల కారణంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో సగానికి పైగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. మాస్కో, యారోస్లావ్ల్, ఉస్ట్-లుగా, పెర్మ్ ప్రాంతాల్లోని కీలక రిఫైనరీలపై దాడులతో రష్యా ఇంధన వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని పేర్కొంది.
రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై వరుస దాడుల కారణంగా ఈ ఏడాది ఇంధన సరఫరా సమస్యలు తలెత్తినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గ్యాసోలిన్ విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించాల్సి రావడంతో పాటు, ఇంధనం కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే చమురు మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై రష్యా పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించలేదు. దేశీయ మార్కెట్‌కు ఇంధనం సరఫరా చేసే చమురు కంపెనీలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ప్రకటించింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం సెప్టెంబర్‌లో ఈ సబ్సిడీలు సుమారు 3.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇదే అత్యధిక నెలవారీ చెల్లింపుగా నిలిచింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!