

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడితో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్న సఫ్రాన్.. లీప్ విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీలో కీలక కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని తయారీ కార్యకలాపాలను చేపట్టేందుకు సంస్థ ఆసక్తి చూపడం తెలంగాణ పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనకు సంబంధించి డిసెంబర్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సఫ్రాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సదస్సుకు హాజరుకావాలని భట్టి విక్రమార్క సఫ్రాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ప్రతిపాదిత రూ.4,000 కోట్ల పెట్టుబడి కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాల తయారీ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుతో పారిశ్రామిక రంగంలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!