

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా అమలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. పల్లె వెలుగు సేవల తరహాలోనే ఏసీ విద్యుత్ బస్సులను గ్రామాలకు కూడా నడపనున్నట్లు తెలిపారు. 2029 నాటికి మొత్తం 5,210 బస్సులను ఆర్టీసీలోకి తీసుకురానుండగా, 2031 నాటికి ఆర్టీసీలో పూర్తిగా విద్యుత్, సీఎన్‌జీ బస్సులే ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రోజుకు రూ.8.50 కోట్ల సబ్సిడీ అందిస్తోందన్నారు. దివ్యాంగ శక్తి పథకం కింద 38.22 లక్షల ప్రయాణాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పథకాల అమలు అనంతరం బస్సుల ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 92 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు.
కేంద్ర సహకారంతో రాష్ట్రానికి 1,000 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, వచ్చే ఐదేళ్లలో జీసీసీ విధానంలో 8,321 విద్యుత్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడతామని తెలిపారు. పీఎం ఈ-బస్ సేవ పథకం కింద 11 నగరాల్లోని 12 డిపోలకు 750 విద్యుత్ బస్సులు కేటాయించగా, ఆగస్టు నుంచి అవి అందుబాటులోకి రానున్నాయి. తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఆర్టీసీ భూములు, డిపోలు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!