

నిశ్చితార్థం రద్దు కేసును ఉపసంహరించుకుని రాజీ చేసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని, లేకపోతే తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోస్టల్ కాలనీకి చెందిన వంశీ చెన్నైలోని విజయ హాస్పిటల్లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన నమ్రత న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి, పెద్దల అంగీకారంతో ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ తర్వాత తన పేరిట ఆస్తులు మార్చాలని, నగదు పంపాలని నమ్రత పదేపదే ఒత్తిడి చేసినట్లు వంశీ ఆరోపించారు. పెళ్లికి ముందే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందిన వంశీ కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిశ్చితార్థం రద్దు కావడంతో నమ్రత వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 2025లో చీటింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా ఫోన్ ద్వారా బెదిరింపులు కొనసాగినట్లు వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె నంబర్‌ను బ్లాక్ చేయడంతో గత నెల రోజులుగా ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపినట్లు ఆరోపించారు. తాజాగా రూ.3 కోట్లు చెల్లించి కేసును సెటిల్ చేసుకోకపోతే చంపేస్తానంటూ ఈ-మెయిల్ వచ్చినట్లు వంశీ పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!