

‘బ్యాక్‌రూమ్స్’ సాధారణ హారర్ సినిమాలకు పూర్తి భిన్నమైన అనుభూతిని అందించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. 20 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్ కేన్ పార్సన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో క్లార్క్ అనే ఆర్కిటెక్ట్ పరిస్థితుల కారణంగా ఫర్నిచర్ స్టోర్‌లో పనిచేస్తుంటాడు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో ఒంటరిగా జీవిస్తున్న అతడు.. ఒక రోజు స్టోర్‌లోని ఓ రహస్య ప్రదేశాన్ని గుర్తించి అందులోకి వెళ్తాడు. అక్కడ అతడికి అంతులేని పసుపు గదుల సమూహం ఎదురవుతుంది. క్లార్క్ కోసం వెతుకుతూ అతడి థెరపిస్ట్ మేరీ కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఈ సినిమాలో దెయ్యాల కంటే వాతావరణం, సస్పెన్స్, మానసిక భయాన్నే ప్రధానంగా ఉపయోగించారు. తనలోని ట్రామాను ఎదుర్కోకుండా దాని నుంచి పారిపోయే క్లార్క్ పాత్ర ద్వారా మనిషి తన బాధాకరమైన జ్ఞాపకాలను అంగీకరించకపోతే ఎదురయ్యే పరిణామాలను చూపించారు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ముగిసిన తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి. అనంతమైన పసుపు గదులను కేవలం గ్రాఫిక్స్‌తో కాకుండా నిజమైన సెట్లతో రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చీవెటెల్ ఎజియోఫర్, రెంజీ ఫెలిజ్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. కొత్త తరహా హారర్‌ను కోరుకునే ప్రేక్షకులకు ‘బ్యాక్‌రూమ్స్’ భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!