

పర్యావరణ పరిరక్షణ కోసం నదులను శుభ్రం చేస్తున్న కార్యకర్త బిట్టు తబాహీ (సురేంద్ర సింగ్ చౌధరి) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కలుషిత నీరు, చెత్తతో నిరంతరం సంబంధం ఉండటం వల్ల చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇటీవల సోషల్ మీడియా వీడియోలో చేతులపై ఏర్పడిన ఇన్ఫెక్షన్లను చూపిస్తూ, వైద్య చికిత్స పొందుతున్న దృశ్యాలను పంచుకున్నారు. కలుషిత నీటిలో పనిచేయడం వల్ల చేతుల్లో దురద, నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులను శుభ్రం చేసే క్రమంలో తన ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని బిట్టు తబాహీ 2026 జనవరిలో ప్రారంభించారు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు, నాచు, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే ఆయన శుభ్రం చేసిన తర్వాత కూడా ప్రజలు మళ్లీ నదిలో చెత్త వేస్తుండటంతో, అదే పనిని పదేపదే చేయాల్సి వస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, నీటి వనరులను కలుషితం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణ పరిరక్షణలో ఆయనకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!