

జాతీయ రహదారుల నిర్మాణంలో భారత్ ఎన్నో రికార్డులు సాధించిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రోడ్ కనెక్టివిటీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో సాంకేతికత కీలకంగా మారిందని, జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మెరుగైన రహదారులు ఉంటే పెట్టుబడులు కూడా భారీగా వస్తాయని అన్నారు. మరోవైపు, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్‌స్పాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల్లో కలిపి 8 వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!