

విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా దృష్టి సారించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం జరిగిన సీఐఐ 25వ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అవసరం లేకుండా వినియోగించకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే ఉత్పత్తి చేసే విద్యుత్ యూనిట్ కంటే చౌకైనదని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వృథాను తగ్గించాలని అన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పరిశ్రమలు, తయారీ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల కారణంగా విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని, ఏఐ ద్వారా విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలని సూచించారు. ఇంధన సామర్థ్యాన్ని ఏడాదికోసారి నిర్వహించే ఆడిట్‌గా కాకుండా నిరంతర నిర్వహణ ప్రక్రియగా మార్చాలని, ప్రభుత్వం, పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!