

ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈశాన్య ప్రాంతంలోని బునియా సమీపంలోని కిగోంజే శరణార్థి శిబిరంలో మే ప్రారంభం నుంచి 30 మందికిపైగా మరణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 933 కేసులు నమోదవగా, 245 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాధారణంగా 15 వేల మందికి పైగా నివసించే ఈ శిబిరంలో నెలకు ఒకటి నుంచి మూడు మరణాలే నమోదవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇటీవల మరణాలు ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది.
వైరస్ వేగంగా వ్యాపిస్తోందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. తలనొప్పి, జ్వరం, వాంతులు ఎబోలా ప్రధాన లక్షణాలు కాగా, ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. తూర్పు కాంగోలో యుద్ధాలు, ఘర్షణల కారణంగా 50 లక్షల మందికిపైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో జీవిస్తున్నారు. కిగోంజేలో పెరిగిన మరణాలు ఇతర శిబిరాలకు కూడా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలకు దారితీస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!